27/06/2018
జూన్ 21 అంతర్జా తీయ యోగ దినోత్సవం గా ప్రకటించడం , ప్రపంచావ్యాప్తంగా ఉత్సవం జరుపు కోవడం అందరి శారీరక, మానసిక ఆరోగ్యాల రక్షణకి శుభారంభం . ఈ సంవత్సరం జూన్ 21 న ICCR, Indian consulate General, New york, సంయుక్తంగా మొదటి అంతర్జాతీయ యోగ కాన్ఫరెన్స్ న్యూయార్క్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత దేశం నుండి 15 మంది, అమెరికా నుండి 12 మంది , ఇంకా సింగపూర్, హాంగ్ కాంగ్ నుండి వివిధరంగాలలో యోగ తో సంబంధం ఉన్నవారు పాల్గొన్నారు. ఇందులో వివిధ వైద్య రంగాలలో పనిచేస్తున్న డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ఫిలాసఫర్లు, ఆర్థికరంగ నిపుణులు, ఒక నృత్యకళాకారిణి, ఒక ముస్లిం ఫిలాసఫర్ ఉన్నారు. అన్నిరంగాలలోనూ యోగ ప్రాధాన్యత ఏమిటి, యోగ సాధన చేస్తే ప్రతి వారు తమతమ రంగాలలో ఎలా రాణించవచ్చు, యోగ సాధన వలన మనసు శరీరాలపై ఎటువంటి ప్రభావం ఉంటుంది, జీవితాన్ని యోగ మార్గం లో నడుపుకుంటే వ్యక్తి, సమాజం శాంతిగా ఉండడానికి ఎలా దోహద పడుతుంది అనే అంశాల గురించి ప్రసంగించారు. అమెరికా లోని హార్వార్డ్ మెడికల్ కాలేజీ నుండి వచ్చిన సత్ బీర్ సింగ్ ఖాల్సా అమెరికా లో ప్రాధమిక విద్యాలయాలలో యోగ ఆసనాలని , ప్రాణాయామాలని తప్పనిసరి చేసే దిశగా తమ ప్రయోగాలు జరుగుతున్నట్లు వివరించారు.
ICCR, భారత ప్రభుత్వ ఆహ్వానం తో, మన తెలుగు రాష్ట్రాలనుండి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా. గాయత్రీదేవి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగ శాస్త్రం మానవులకి కైవల్య మార్గాన్ని చుపించాడానికి ఆవిర్భవించింది. ఆయుర్వేదజ్ఞులు మొట్టమొదట, యోగ శాస్త్రం మానవుల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని గ్రహించి తమ చికిత్సలలో వాడినట్లు చరక సంహితలో ఆధారాలు ఉన్నాయని, ఆయుర్వేదం లో మానసిక చికిత్సలకు అవసరమయిన సత్త్వావజయ చికిత్స కి యోగ శాస్త్రం ఆధారమని, ఆయుర్వేద వైద్య విద్యలో మానసిక చికిత్సా విభాగాన్ని యోగ శాస్త్రం ఆధారం గా అభివృద్ధి చెయ్యవలసిన అవసరం ఉందని డా. గాయత్రీదేవి తనప్రసంగంలో తెలియజేసారు.ఈ కార్యక్రమంలో consul general సందీప్ చక్రవర్తి, ICCR president వినయ్ శతబుద్ధే , SVYASA university బెంగుళూరు president డా. నాగేంద్ర గారు, డా. సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని కాన్సులేట్ వారు చాలా చక్కగా, శ్రద్ధగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ యోగ అసోసియేషన్ ప్రారంభించారు, రెండవ కాన్ఫరెన్స్ కూడా ఇదే శ్రద్ధతో మరో దేశంలో నిర్వహిస్తామని ప్రకటించారు.
నిత్యజీవితంలో యోగ సాధనకి ఉన్న ప్రాధాన్యతని మన విద్యాలయాల వారు కూడా గుర్తించి పిల్లలందరికీ తప్పనిసరిగా నేర్పిస్తే అనేక మానసిక, శారీరక ఆరోగ్యసమస్యలని నిరోధించవచ్చని ఆయుర్వేదంతో పాటుగా యోగ శాస్త్రంలో కూడా PhD చేసిన డా. గాయత్రీదేవి అన్నారు.