09/09/2023
*జనరిక్ మందులు అనగా క్వాలిటీ లేని మందులు అని వైద్యులు ప్రజలకు అపోహ కల్పిస్తున్నారు.*
జనరిక్ పేరు అనగా మందు / ఔషధం యొక్క శాస్త్రీయ నామము, ప్రతి మందును అనేక కంపెనీలు మార్కెట్లో విక్రయించడానికి బ్రాండ్ల పేర్లతో సరఫరా చేస్తూ ఉంటారు. తమ ప్రతి బ్రాండ్ కు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇతర కంపెనీలు అవే పేర్లతో మందులు అమ్మకుండా హక్కులు పొందుతారు.
తమ కంపెనీలకు చెందిన బ్రాండెడ్ మందులనే వైద్యులు రాయాలని మెడికల్ రిప్రజెంటేటివ్ ల ద్వారా అనేక రకాల తాయిలాలు అందజేసి వైద్యాన్ని వ్యాపారం చేశాయి మందుల కంపెనీలు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మందుల వినియోగదారుల హక్కులు కాపాడడానికి, వైద్యంపై ప్రజలు చేసే ఖర్చును తగ్గించడానికి వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్లలో కంపెనీల యొక్క బ్రాండ్ల పేరు కాకుండా, మందు యొక్క శాస్త్రీయ నామాన్ని, మరియు డోసును రాసినట్లయితే రోగులు తమ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి, వారి యొక్క అభిరుచినిబట్టి డాక్టరు సూచించిన మోతాదులోనే ఆ యొక్క ఔషధాన్ని తమకు ఇష్టమైన మెడికల్ షాపునకు వెళ్లి నమ్మకమైన కంపెనీలు తయారు చేసే మందులనే కొనుగోలు చేసే హక్కు వినియోగదారులుగా ప్రతి ఒక్క రోగికి ఉంటుంది.
కానీ వైద్యులు ఫార్మా కంపెనీల నుంచి వచ్చే తాయిలాలకు ఆశపడి తమ ఆసుపత్రిలో తాము సొంతంగా ఏర్పాటు చేసుకున్న మందుల షాపులలోనే మందులు కొనుగోలు చేయాలని దురుద్దేశంతో అర్థం కాని భాషలో తమకు తాళాలు అందజేసే కంపెనీల బ్రాండ్ల పేర్లు రాయటం వినియోగదారుల హక్కులను కాల రాసినట్లే.
కొంతమంది డాక్టర్లు ఫార్మస్యూటికల్ మార్కెటింగ్ కంపెనీలను రిజిస్టర్ చేసుకొని తామే సొంతంగా థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల ద్వారా మందులు తయారు చేసుకొని, బయట ఎక్కడ సరఫరా లేని బ్రాండ్ల పేర్లు పెట్టుకుని ఇస్తారాజ్యంగా వాటికి ధరలు నిర్ణయించి, తమ ఆసుపత్రులలో ఏర్పాటు చేసుకున్న సొంత మెడికల్ షాపుల నుంచే ఆ మందులను రోగులకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. తద్వారా అమాయక ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు.
ఇలాంటి మోసపూరితమైన వైద్య విధానానికి చెక్ పెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా వారి ప్రిస్క్రిప్షన్ లలో మందులు యొక్క జనరిక్ పేర్లను మాత్రమే రాయాలని సూచిస్తున్న, పెడచెవిన పెడుతున్నారు.