16/02/2015
డిగ్రీతో నాబార్డ్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం
» ఎంపికైతే రూ.40 వేలకు పైగా వేతనం
» బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారికి ప్రయోజనం
» మొత్తం ఖాళీలు 128
భారత ప్రభుత్వానికి చెందిన జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) గ్రేడ్ ఎ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ప్రకటన విడుదలచేసింది. ఈ ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్థులు పోటీపడొచ్చు. ఇప్పటికే బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు నాబార్డ్ పరీక్షలో రాణించొచ్చు. రెండు పరీక్షల్లోనూ అంశాలు ఉమ్మడిగా ఉండడం అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. ప్రకటన వెలువడిన నేపథ్యంలో అర్హతలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం.
విభాగాల వారీ పోస్టులిలా..
అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఎ (ఆర్‌డీబీఎస్) - 100
మేనేజర్స్ గ్రేడ్ బి (ఆర్‌డీబీఎస్) - 6
అసిస్టెంట్ మేనేజర్స్ (రాజభాష సర్వీస్) - 6
అసిస్టెంట్ మేనేజర్స్ (లీగల్ సర్వీస్) - 3
అసిస్టెంట్ మేనేజర్స్ (ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్) - 10
విద్యార్హత: అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఎ రూరల్ బ్యాంకింగ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (ఆర్‌బీఎంఎస్) పోస్టులకు ఏదైనా డిగ్రీ లేదా పీజీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. మేనేజర్ గ్రేడ్ బి ఆర్‌బీఎంఎస్ పోస్టులకు ఏదైనా డిగ్రీలో 60 శాతం లేదా పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాజభాష సర్వీస్, లీగల్ సర్వీస్, ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ పోస్టులకు సంబంధిత విభాగాల్లో డిగ్రీలు ఉండాలి.
వయోపరిమితి: నవంబర్ 30, 2014 నాటికి 30 ఏళ్లకు మించరాదు. అంటే డిసెంబర్ 1, 1984 కంటే ముందు నవంబర్ 30, 1993 తర్వాత జన్మించినవారు అనర్హులు. (ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యుడీ అభ్యర్థులకు కేటగిరీని బట్టి పదేళ్ల నుంచి పదిహేనేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 15, 2015
పరీక్ష ఫీజు: ఏ పోస్టుకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ అభ్యర్థులకు రూ. వంద; మిగిలిన అందరు అభ్యర్థులకు గ్రేడ్-ఎ పోస్టులకు రూ.750, గ్రేడ్-బి పోస్టులకు రూ.850.
పరీక్ష తేదీ: ఫిబ్రవరి, మార్చి నెలల్లో వివిధ తేదీల్లో ఆన్‌లైన్ పరీక్షలు ఉంటాయి. ఆదివారాలు కాకుండా పనిదినాల్లోనే ఈ పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్ష తేదీలను నాబార్డ్ వెబ్‌సైట్‌లో తర్వాత ప్రకటిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఫేజ్-1 ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, కంచికచెర్ల, గుడ్లవెల్లూరు, ఏలూరు, విజయనగరం
తెలంగాణలో: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని వివిధ కేంద్రాలు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం
ఫేజ్ 2 పరీక్ష కేంద్రాలు: ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, చెన్నై గువాహతి.
వేతనాలిలా...
గ్రేడ్-ఎ పోస్టులకు ప్రస్తుతం మూలవేతనం రూ. 17100గా ఉంది. ఎంపికైనవారికి నెలకు రూ.40,562 దక్కుతుంది. త్వరలో ఈ వేతనాలు మరింత పెరగనున్నాయి. గ్రేడ్-బి పోస్టులకు రూ.50669 వేతనంగా లభిస్తుంది. జీతంతోపాటు వివిధ ప్రోత్సాహకాలుంటాయి.
ఎంపిక విధానం
ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫేజ్ 2 మెయిన్ పరీక్షలు, ఫేజ్ 3లో నిర్వహించే మౌఖిక పరీక్ష ద్వారా
ఫేజ్-1: ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పూర్తిగా ఇది ఆబ్జెక్టివ్ పరీక్ష. ఏ పోస్టుకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ అందరికీ ఈ పరీక్ష మాత్రం ఉమ్మడిగానే ఉంటుంది. మొత్తం 200 మార్కులకు ప్రశ్నలడుగుతారు.పరీక్ష వ్యవధి 130 నిమిషాలు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కి 50, రీజనింగ్ 50, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30, కంప్యూటర్ అవేర్‌నెస్ 30, జనరల్ అవేర్‌నెస్ 40 మార్కులకు ఉంటాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులనే ఫేజ్-2కి అనుమతిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
ఫేజ్-2: ఈ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలోనే ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 అన్నిపోస్టులకు కామన్. ఈ పేపర్లో జనరల్ ఇంగ్లిష్ విభాగం నుంచి ప్రశ్నలుంటాయి. మొత్తం మార్కులు వంద. పరీక్ష వ్యవధి 3 గంటలు. అభ్యర్థిలో ఆంగ్లభాషలో రాసే, విశ్లేషించే పరిజ్ఞానం ఏమేరకు ఉందో పరిశీలిస్తారు. దీనికోసం ఎస్సే, కాంప్రహెన్షన్, రిపోర్ట్, పారాగ్రాఫ్, లెటర్ రైటింగ్‌ల్లో ప్రశ్నలడుగుతారు. పేపర్ 2లో ఆర్థిక, సాంఘిక అంశాలపై ప్రశ్నలుంటాయి.. ఆర్‌బీఎంఎస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి ఈ పేపర్ కామన్‌గా ఉంటుంది. ఇది కూడా పూర్తిగా డిస్క్రిప్టివ్ పరీక్షే. వ్యవధి 3 గంటలు. ఇంగ్లిష్ లేదా హిందీ మాధ్యమంలో జవాబులు రాసుకోవచ్చు.
ఫేజ్-3: ఫేజ్ 2లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ బట్టి అభ్యర్థులను ఫేజ్ 3లో నిర్వహించే ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఫేజ్-2లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ మార్కులను కలిపి తుది ఎంపిక చేపడతారు. అయితే ఇంటర్వ్యూకు ఎన్ని మార్కులు కేటాయించారో ప్రకటనలో స్పష్టం చేయలేదు.
సన్నద్ధమిలా...
ఇప్పటికే బ్యాంకు ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్నవారు ఫేజ్-1 ప్రిలిమినరీ ఆన్‌లైన్ పరీక్షను ఎదుర్కోవచ్చు. ఎందుకంటే ఈ రెండు పరీక్షల్లోనూ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ అవేర్‌నెస్ అంశాలు ఉమ్మడిగా ఉంటాయి. అందువల్ల బ్యాంకు పరీక్షల సన్నద్ధతతో నాబార్డ్ అసిస్టెంట్ పోస్టులకు సిద్ధం కావొచ్చు. అభ్యర్థులు వీలైనన్ని మోడల్ ప్రశ్నపత్రాలు సాధనచేయాలి. ఫేజ్ 1లో రాణిస్తేనే ఫేజ్ 2కి ఎంపికచేస్తారు కాబట్టి పూర్తిస్థాయి సన్నద్ధత అవసరం. ఫేజ్ 2లో పేపర్ 1ను ఎదుర్కోవడానికి ఇంగ్లిష్‌పై పట్టుండాలి. కేవలం వ్యాకరణాంశాలు తెలిస్తే సరిపోదు. అభ్యర్థి రచనా కౌశలాన్ని పరిశీలిస్తారు. అందువల్ల తప్పులు లేకుండా, ప్రభావవంతంగా రాయడాన్ని ఇప్పటి నుంచే సాధన చేయాలి. ఈ ఫేజ్‌లోనే పేపర్ 2 అర్ధశాస్త్ర అంశాలపై ఉంటుంది. డిగ్రీ స్థాయిలో ఎకనామిక్స్ చదివినవారు ఈ పేపర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. పేపర్ 2ను సిలబస్ ప్రకారం ఇప్పటి నుంచే చదువుకోవాలి. ఆర్థికరంగంలోని ముఖ్యాంశాలను నోట్సుగా రాసుకోవడం, హిందూ దినపత్రికలో ఈ రంగంపై వచ్చే వ్యాసాలను చదవడం ద్వారా పేపర్ 2ను సమర్థంగా ఎదుర్కోవచ్చు. సైన్స్ విద్యార్థులు ఈ పేపర్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపడం తప్పనిసరి.